3, సెప్టెంబర్ 2015, గురువారం

సంస్కృతి అనే మహానదిని సరసీకరించడం



నాలుగువేల సంవత్సరాల క్రితం భారతదేశంలో సరస్వతి అనే నది ఒకటుండేదని చెబుతారు. అది హిమాలయాల్లో పుట్టి ఈనాటి కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవహించేదట. విచిత్రమేంటంటే ఈనాడు హిందూధర్మానికంతటికీ పూజనీయమైన గంగానది ప్రస్తావన వేదాల్లో క్వాచిత్కమే. కానీ సరస్వతీనది ప్రస్తావన మటుకూ విస్తారం. అందుచేత వేదాల్ని రచించిన ఋషులెక్కువమంది ఆ నదీతీరవాసులేమో ననే అనుమానం కూడా చరిత్రకారుల్లో లేకపోలేదు. కురుపాండవుల కాలానికి ముందు అది నేటి గోదావరిలా మంచి ఉరవడితో సువిశాలంగా పరవళ్ళు త్రొక్కుతూ కొన్ని వందల కిలోమీటర్ల పొడవునా నిరంతర జీవధారగా ప్రవహించేదని తెలుస్తోంది. అందుకే వేదవ్యాసుడు కూడా తన బదరికాశ్రమాన్ని ఆ నది ఒడ్డునే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అక్కడే తనువు చాలించాడని కూడా చెబుతారు.  

కురుపాండవయుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేక ఆ సమయంలో తీర్థయాత్రలకని చెప్పి వెళ్ళిపోయిన బలరాముడు తిరిగొచ్చాక ఆయన్నెవఱో ఆ యాత్రావిశేషాల గుఱించి అడిగారట. ఆయన అవన్నీ చెబుతూ మధ్యలో ఓ మాట అన్నాడు: “సరస్వతీనది ఇదివఱకట్లా అఖండంగా ప్రవహించడం లేదు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఎండిపోతోంది.” అని! ఈ కొద్దికొద్దిగా ఎండిపోయే ప్రక్రియ బలరాముడి కాలం (క్రీ.పూ. 3100) నుంచి సుమారు వెయ్యీ-పదకొండొందల ఏళ్ళ పాటు జఱుగుతూ జఱుగుతూ వచ్చి ఆఖరికి 3,900 ఏళ్ళ క్రితం పూర్తిగా ఎండిపోయిందనీ, అందుమూలాన సింధునాగరికత అంతరించిపోయిందనీ, ఒకప్పటి నది స్థానంలో, అది ప్రవహించిన మార్గంలోని పల్లపు గుంటల్లో పెద్దపెద్ద చెఱువులు ఏర్పడ్డాయనీ చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. చెఱువుని సంస్కృతంలో సరస్ అంటారు. సరస్సులు కలిగినది సరస్వతి అన్నమాట. 

మానవ సంస్కృతి కూడా నది లాంటిదే. దాన్ని అఖండంగా ప్రవహించనివ్వాలి. ఓ పొడవైన జీవధారగా దానికున్న స్వరూపాన్నీ పేరుప్రతిష్ఠల్నీ చెడగొట్టేసి దాని విశాలత్వానికి ఆనకట్టలు కట్టి ఓ ప్రాంతానికే పరిమితం చేయకూడదు. అలా చేస్తే అది సరస్వతీనది విషయంలో జఱిగినట్లు సరసీకరణ (చెఱువులుగా మారడం) కి గుఱవుతుంది. అఖండ నదీమతల్లి కాస్తా నామరూపాలు లేకుండా నశించిపోయి దాని స్థానంలో స్థానిక పేర్లతో సాంస్కృతిక కుంటలూ, చెఱువులూ మిగుల్తాయి. అప్పుడు ఆ జాతీ, దాని సంస్కృతీ ఎక్కడున్నాయో, వాటి అసలు (ఒరిజినల్) స్వరూపాలు ఏమిటై ఉంటాయో నని భావిచరిత్రకారులు సరస్వతీనది విషయంలో మాదిరే ప్రత్యేక పరిశోధనలు చేయాల్సి వస్తుంది.  

దేవుడే స్వయంగా అవతారం ధరించి వచ్చినా సరే, ఆయన కూడా ఏదో ఒక కులంలో, ఏదో ఒక మతంలో, ఏదో ఒక ప్రాంతంలో పుట్టక తప్పదు. ఇహ మానవులం, మనం అనగా ఎంత? మనలో పుట్టిన మహనీయులూ, రచయితలూ కూడా అంతే కదా! వారిని ఒక కులస్థులుగా, మతస్థులుగా, ప్రాంతీయులుగా ముద్రవేసే ముందు, ముద్రవేసి బహిష్కరించే ముందు అసలు వారు తాము జీవించి ఉన్న కాలంలో తమ గుఱించి తాము ఏమని భావించుకున్నారో, ఏ ప్రాంతానికి చెందామని భావించుకున్నారో ఆలోచించాలి కదా? వారు రచనలు చేసేటప్పుడు ఎవఱిని ఉద్దేశించి చేశారు? అది కూడా గమనించాలి కదా! మనకున్న రాజకీయ కార్యావళులు (political agendas) వారికున్నాయా? అది యోచించాలి కదా! ఎంతసేపూ మనం మన కాలమాన పరిస్థితుల్ని బట్టి వారిని ఏ దృష్టితో చూస్తున్నామో అదొక్కటే ముఖ్యమా? పూర్వులైన వారి దృష్టికోణానికి ఏమీ విలువ లేదా?

మేధావులు వాస్తవంగా ప్రజలకి చెందినవారు. వారు ప్రజల్లోంచి వచ్చారు. వారు ప్రభుత్వాలకి చెందినవారు కారు. ఎందుకంటే ప్రభుత్వాలకి మేధావులు అవసరం లేదు. వాటికి మరమనుషులు కావాలి. కీలుబొమ్మలు కావాలి. ఓ ప్రభుత్వం ఓ సంకుచిత ప్రాతిపదికని ఏర్పఱచుకుని దాని ఆధారంగా కొంతమంది దివంగత మేధావుల్ని తనవారుగానూ, మఱికొంతమంది దివంగతుల్ని పరాయివారుగానూ చిత్రీకరిస్తే అటువంటి నిర్ణయాలకి ప్రజలమైన మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఏముంది? మనం అమెరికన్లని చదువుతాం. రష్యన్లని చదువుతాం. ఫ్రెంచివారినీ చదువుతాం. వాటిల్లో వేటిమీదా లేని ఆంక్షలు మనవారిని మనం చదవడం మీద విధిస్తూంటే దీన్ని సరసీకరణ అనక ఇంకేమనాలి? 

ప్రభుత్వాలకి మనం వోట్లు వేసినది – మన జీవితాల్ని బాగుచేయమని! అంతే తప్ప, మనం ఏం చదవాలో, ఏం చదవకూడదో, మనం ఎవఱిని మనవారుగా భావించాలో, ఎవఱిని భావించకూడదో శాసించడానిక్కాదు. ఇలాంటి పనుల్ని ఖండించడానికి కొంతమందికి ప్రాంతీయవాదం అడ్డొస్తే, వాటిని సమర్థించడానికి నాబోటివారికి మానవతావాదం అడ్డొస్తుంది. ఈ చర్యల్ని ఖండిస్తున్నవారు లేరని కాదు. ఉన్నారు. కానీ వారు తమ ప్రభుత్వం ఇలాంటి చర్యలకి పాల్పడితే వెనకేసుకొస్తారు. ఇతర ప్రభుత్వాలు పాల్పడితే మాత్రం నిర్ద్వంద్వంగా ఖండిస్తారు. ప్రస్తుతం అలాగే ఖండిస్తున్నారు కూడా!  

నిజమే. వారి హృదయం ఎంత గాయపడి ఉంటుందో అర్థం చేసుకోవాలి. కానీ “అందఱమూ ఒకటే” అనుకున్న రోజుల్లో- ఆ దృష్టి కలిగిన ప్రభుత్వం కూడా ఉన్నరోజుల్లో అనాధికారిక వ్యక్తులైన వీరు ఆ సందేశాన్నిచ్చే పాటల్ని పాడనివ్వకుండా విజయవంతంగా అడ్డుపడగలిగారు. “ఇతరులు/ బయటివారు” అని తాము తమ సైద్ధాంతిక చాదస్తాల కొద్దీ ఎవఱికైతే ముద్రవేశారో ఆ పూజనీయుల విగ్రహాల్ని అమానుషంగా, నీచంగా, హీనంగా, చిల్లఱగా అవమానించడానికి వెనుదీయలేదు. అలా చేస్తే తమ సిద్ధాంతానికి చెందని ఇతరులు ఎంత బాధపడతారనేది వీరు ఆనాడు ఆలోచించలేదు. మనం స్వయంగా ఒకచోట ముట్టించిన కార్చిచ్చు ఈరోజు మన ఇంటిదాకా వస్తూంటే “అయ్యో ఎవఱూ వచ్చి ఆర్పరేంటి?” అని ఆర్తనాదాలూ హాహాకారాలూ చేయడం అనవసరం.  

ప్రభుత్వాలు పరిపాలనాసౌలభ్యం కోసం ఉన్నటువంటివి. అంతకు మించి వాటికి పెద్దగా విలువేమీ లేదు. అవి ఏ సిద్ధాంతాల పేరు చెప్పుకుని బ్రతుకుతూంటాయో వాటితో సంబంధం లేని మేధావులకి ప్రాంతీయ ముద్రలు వేసి అవమానించే హక్కు వాటికి లేదు. గొప్పగొప్ప వైజ్ఞానిక/ సాంకేతిక ఆవిష్కారాలూ, నవకల్పనలూ చేసిన శాస్త్రవేత్తల్లో నూటికి 99.99 శాతం మంది మన ప్రాంతీయులు కారు. కానీ వారు కనుక్కున్నవాటిని వాడుకోవడానికి మనకి ప్రాంతీయ స్వాభిమానం అడ్డురావడం లేదు. క్లిష్టమైన శస్త్రచికిత్సల కోసమో, భారీ చేపట్టుల (mega projects) కోసమో విదేశాల నుంచి నిపుణుల్ని రప్పించుకునేటప్పుడు మనకి ప్రాంతీయ అస్తిత్వవాదాలు అడ్డురావడం లేదు. ప్రపంచబ్యాంకు ముందు జోలిపట్టి అడుక్కునేటప్పుడు మనలోని రకరకాల “బిడ్డపౌరుషాలు” ఏమవుతున్నాయో తెలీదు. కానీ ఒక కవిని, ఒక రచయితని, ఒక మేధావిని, ఒక సంస్కర్తని, ఒక ఉద్యమకారుణ్ణి గౌరవించాలన్నప్పుడు మాత్రమే ఇవన్నీ హఠాత్తుగా ఎందుకు రంగప్రవేశం చేస్తాయన్నదే నాకు అర్థం కాదు. అంటే శాస్త్రవేత్తలకీ, వైద్యులకీ, ఎంజినీర్లకీ మనం ఇస్తున్న విలువలో 1% చేయరా కవులూ, రచయితలూ, సామాజిక చింతనులూ?

సరే! ఇప్పుడు ఒకటి రెండయింది. ఱేపు ఈ రెండు కాస్తా మూడు కావచ్చు. అప్పుడు ఆ మూడోవారి ధోరణి కూడా అదే అయితే వీరంతా కలిసి ఒక మహానదిలాంటి సంస్కృతిని చంపేసి ప్రోగులు పెడతారు. వీరిని చూస్తే మీకు ఏమనిపిస్తోంది? నాకైతే 55 సంవత్సరాల నాడు వచ్చిన పరమానందయ్యశిష్యులు అనే చలనచిత్రంలో గురువుగారి కాళ్ళని తెగనరకబోయిన మూర్ఖశిష్య పరమాణువులు గుర్తుకొస్తున్నారు. ఆ సన్నివేశాన్ని ఇక్కడ వీక్షించండి.

రాజకీయాలతో సంబంధం లేని కవులకీ, మేధావులకీ ఈ ప్రాంతీయ ముద్రాంకన (regional branding) వేయడం ఇకనైనా మానుకుందాం. మనం నిజంగా మేధావులమైతే మేధావి అయిన ప్రతివాడూ మనవాడే. 
 

5, మార్చి 2015, గురువారం

ద్వేషిద్దాం పదమంటే...

ద్వేషిద్దాం పదమంటే 
దేశాలే కదుల్తాయి
ప్రేమ చూపుదామంటే
పిడికెడుమందీ రారు

ఏ అమ్మ కుమారుణ్ణో
ఏసెయ్యమనడానికి
మంది మందలు కడతారు, తాము
మంచివాళ్ళమనుకుంటారు
ఏ తల్లి లేని బిడ్డనో 
ఎదిగిద్దాం రమ్మంటే
ఎటువాళ్ళటు పోతారు
కటికమాటలు మిగులుతారు

కొంపలు కూలుద్దామంటే
గుంపులుగా పోగవుతారు
ఇళ్ళు కట్టిపెడదామంటే
ఇటుక ముక్క దానం చెయ్యరు
ఒకఱి శీలహననం కోసం
చకచక దిగుతారు సహస్రం
వారి గతసౌజన్యకోణం
ఒక్కడైనా చూడడు నేస్తం!

ద్వేషవారుణి క్రోలకుండా
దేనికీ చుఱుకు పుట్టదేల?
ఎదలో మానవప్రేమకు 
ఎత్తామెందుకు దివాలా?
విపుల మానవ కల్యాణాని
కుపకరించే సిరిసంపదలు
ద్వేషధూమం పుణ్యమాని
దేకుతున్నాయి బుఱదలో

అందఱొకప్పుడు మానవులు
కొందఱు మాత్రమే దానవులు
అందఱూ దానవులైన తఱిని
హరి వధించేదెవ్వఱిని?

2, మార్చి 2015, సోమవారం

సిద్ధాంతవాదులు

కుందేళ్ళలా వస్తారు 
సిద్ధాంతవాదులు,
తోడేళ్ళై కఱుస్తారు - కళ్ళున్న కబోదులు ;
జాగ్రత్తోయ్ తమ్ముడూ! 
కాస్త జాగ్రత్త!!

వలవలా ఏడుస్తారు
తొలుత నీ ఎదుట ;
విలవిల తన్నుకుంటారు
మూర్ఛరోగిష్ఠిలా ;
కఱిగిస్తారు నీ గుండె
కష్టాలు వర్ణించి ;
చెఱువవుతుంది నీ కడుపు
చెప్పుడు మాటలకి || కుందేళ్ళలా ||

చిన్నవి పెద్ద చేస్తారు
సిద్ధాంతాలతో  ;
రక్తాలు విడదీస్తారు
రాద్ధాంతాలతో ;
సందు చేసుకుంటారు 
ఇబ్బందులొస్తే ;
ముఱికి చీకటికూపాల్లో
మూషికాల్లాగా || కుందేళ్ళలా ||

పద్ధతి మారిపోతుంది
పదిమంది దొఱికాక ;
వారిలో నువ్వూ ఉంటా
వోరీ అమాయక! ;
తొంభైమందిని పదిమంది
తొక్కిపట్టేశాక,
ఆశ్చర్యంగా కుక్కనే
ఆడించేను తోక || కుందేళ్ళలా ||

తమలో ఒకఱిద్దఱివి 
శ్రమలూ కష్టాలు,
చూపి తెచ్చుకుంటారు
సుఖమయ చట్టాలు ;
తొండికి పాల్పడతారు
అడుగడుగడుగునా ;
ధర్మువు న్యాయమడిగితే 
దరువే నీ వీపున || కుందేళ్ళలా ||

పాదుకలు మోస్తారు
పరపతిమంతులవి ;
ఆక్రమించుకుంటారు
పదవులు మంత్రులవి ;
సిద్ధాంతం ప్రభుత్వమై
విధ్వస్తం ప్రజ,
యాచించిన హస్తాలే
శాసిస్తూండగా || కుందేళ్ళలా ||

సృష్టిస్తామంటారు
కొత్తలోకాన్ని ;
భ్రష్టుపట్టించుతారు
వర్తమానాన్ని ;
పాతలోక నియమాలే
కొత్తవర్గాలకి,
పోస్తారు పాత సారా
కొత్తసీసాలో || కుందేళ్ళలా ||

సమాజానికంటారు
తమ సిద్ధాంతాలు ;
బ్రతికిస్తామంటారు
ప్రజలను వాటితో ;
చివఱికి బ్రతకమంటారు 
సిద్ధాంతానికే ;
వద్దంటే ఎవఱినీ 
వదలరు ఊరికే || కుందేళ్ళలా ||

25, ఫిబ్రవరి 2015, బుధవారం

దేవులాడి అలిసిపోకురా!

దేవులాడి అలిసిపోకురా మానవా!
దేవతలూ దేవుళ్ళూ మనలో లేరయా!
సాధారణ మానవులే సర్వే సర్వత్ర
సన్నిహితులతోనే తనివి చెందయా! నీ-
సన్నిహితులతోనే తనివి చెందయా!

దేవతలని ముందనుకోవడమెందుకు?
దెయ్యాలని పదపడి తిట్టడమెందుకు?
అందఱిలోనూ నిన్నే చూసుకోవోయ్!
అందఱూ నినుబోంట్లని తెలుసుకోవోయ్!

మాన్యులనీ సామాన్యులనీ పిలవకు
మనుషులుగా బహుమానించుట మఱవకు
పెద్దమనసు చేసుకు భరించాలయా!
పెద్దల లోపాలూ పాపాలూ అరిషట్కాలూ

దైవమెదురుపడితే తట్టుకోగలమా?
మనుషులలో దైవత్వం మనకవసరమా?
మనుషుల లోపాలవి దేవతలకు లేవా?
నరులెన్నివిధాలో సురలన్నీ కారా?

ఎలా ఉన్నవాళ్ళని అలాగే తీసుకో!
పేర్లుపెట్టకుండా ప్రేమగా చూసుకో!
ఒకనాటికి పెద్దలూ సఖులవుతారులే!
పెద్దఱికం కన్నా ప్రేమే గొప్పదిలే!

 

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

వద్దురా సిద్ధాంతాలు !

వద్దురా! సిద్ధాంతాలొద్దురా !!
రాద్ధాంతాలొద్దురా
మనకు మానవతే ముద్దురా!

సిద్ధాంతంతో నువ్వవుతావు
సింహానివీ చిఱుతపులివీ
మనసుకు మాత్రం హత్తుకోవు
మనిషిగా, నిండు మనిషిగా || వద్దురా ||

నీ సిద్ధాంతాల కళ్ళల్లో
నేఱస్థులేరా ప్రతి ఒకఱూ
సహజాలన్నీ చట్టవిరుద్ధం
వైవిధ్యం పెద్ద అబద్ధం || వద్దురా ||

సిద్ధాంతాల ఉన్మాదంలో 
చితికిపోతుంది మానవత్వం
సూక్ష్మాంశాలకు చోటుండదు
చెబితే వినే నాథుడుండడు || వద్దురా ||

సిద్ధాంతాల శీధువు మత్తులు
శిరస్సుకెక్కిన తాగుబోతులు
తమ కళ్ళు పొడుచుకుంటారు
తప్పుదారిన నడిపిస్తారు || వద్దురా ||

పిడుగూ-బియ్యాలకొకటే మంత్రం
గుంపుగూండాయిజం తమ తంత్రం
ఎంతసేపటికీ తమదే గొడవ
ఎదుటివాడెల్లప్పుడూ వెధవ || వద్దురా ||

సిద్ధాంతాలు పద గారడీలు
పరస్పరం వెకిలి పేరడీలు
మతిగల మతిహైన్యాలు, హృదయం
శ్రుతి చెయ్యని కఠోర వాద్యాలు || వద్దురా ||

16, ఫిబ్రవరి 2015, సోమవారం

ఒక చేద నీరు

ఒక చేద నీరైన పోద్దాం
సెగ కాస్త చల్లార్చిపోదాం

ఈ తనువులు పుట్టక ముందే
ఇల కాలే రావణకాష్ఠం
అనుకుని మఱీ ఎందుకయా
ఆజ్యం పోసే పాపిష్ఠం || ఒక చేద ||

ఒక ఓడ నిర్మించి పెడదాం
ఒక గోడ నిలబెట్టి వెడదాం

మనం కళ్ళు తెఱవక ముందే
మహి మహా శోకసముద్రం
పాతవి పూడవకే ఎందుకు
గోతులు తవ్వే దరిద్రం
కొత్త గోతులు తవ్వే దరిద్రం ? || ఒక ఓడ ||

చేద్దాము హృదయాల సాగు, పా-
రిద్దాము సాయాల వాగు

మనం క్యారుమనక ముందే
మానవీయత కిది మరుభూమి
కఱువును తీర్చక పోగా, ఉన్న
ఖర్జూరాలు కూల్చడమేమి?  || చేద్దాము ||

విప్పుదాం పాత సంకెలలు
తిప్పుకోనిద్దాం ఊపిరులు

మనం జన్మమెత్తక ముందే
మనుజలోకమొక చెఱసాల
నవ నిబంధనల బంధనాల
అవని నాశనం చేయనేల? || విప్పుదాం ||

11, ఫిబ్రవరి 2015, బుధవారం

మనకు మనమే

మనకు మనమే అంతా
మనకు మనమే అంతా
కర్తలమూ కర్మలమూ
క్రియలమూ ఫలాలమూ ||కర్తలమూ||

భయమెందుకు మన బతుకులు
మనవేనని చాటేందుకు?
ఎంతవఱకు మన బాధల
కితరుల దూషించు దుడుకు?

మంచి-చెడులు మనలోనే
సుఖదుఃఖం మన కృతమే
ధీమాగా ధైర్యంగా
తీసుకుందాం బాధ్యతను

లోపాలు దిద్దుకుందాం
శాపాలు బాపుకుందాం
తిరుగులేని జాతకాన్ని
తిరగరాసుకుందాం

లోన లేని లోపమొకఱు
సృష్టి చేయలేరు సుమా
కలిగినదే కనిపెట్టి
వాడుకుంటారు యమా

భయమెందుకు మన బతుకులు
మనవేనని చాటేందుకు?
ఎంతవఱకు మన బాధల
కితరుల దూషించు దుడుకు?